ఎస్‌ఐఆర్ అవగాహన సమావేశం విజయవంతం చేయాలి: బొడ్డు గంగన్న
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటర్ల సవరణ) కార్యక్రమంపై ఈ నెల 16న కొండుకూర్‌లో నిర్వహించనున్న అవగాహన సమావేశాన్ని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు గంగన్న పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మంగళవారం మండల కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొండుకూర్‌లోని ఎస్‌కే ఫంక్షన్ హాల్‌లో జరిగే ఈ సమావేశానికి ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ప్రాముఖ్యత, ఓటరు నమోదు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై ఎమ్మెల్యే దిశానిర్దేశం చేయనున్నారని చెప్పారు. దస్తూరాబాద్, కడెం మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఎల్‌వోలు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జడ రాజేశ్వర్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు సీతారాం, ఉపాధ్యక్షులు పడిగెల రాజు, మహబూబ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి ముడికే మల్లేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రెంకాల శ్రీనివాస్, వెడ్మ జంగు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
