రెగ్యులర్ డీఈవోను నియమించాలి

  • అన్ని మండలాలకు రెగ్యులర్ ఎంఈవోలు అవసరం
  • డీఆర్వోకు ఆమ్ ఆద్మీ పార్టీ వినతిపత్రం

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రెగ్యులర్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)తో పాటు అన్ని మండలాలకు రెగ్యులర్ మండల విద్యాశాఖ అధికారులను (ఎంఈవోలు) వెంటనే నియమించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాగుల అరవింద్ మాట్లాడుతూ.. జిల్లా ఏర్పడి తొమ్మిదేళ్లు దాటినా డీఈవో, ఎంఈవో పోస్టులు ఎక్కువగా ఇన్‌చార్జి అధికారులతోనే కొనసాగుతున్నాయని విమర్శించారు. రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో జిల్లాలో విద్యావ్యవస్థపై సమర్థవంతమైన పర్యవేక్షణ కొరవడుతోందని, దీని ప్రభావం ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై పడుతోందని పేర్కొన్నారు.

ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూలు, బోధన ప్రమాణాలపై కూడా సరైన పర్యవేక్షణ లేకుండా పోతోందని ఆరోపించారు. విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు జిల్లాకు రెగ్యులర్ డీఈవోతో పాటు అన్ని మండలాలకు రెగ్యులర్ ఎంఈవోలను నియమించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోశాధికారి వాసాల శ్రావణ్ కుమార్, పట్టణ నాయకుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు.