గ్రీన్ ల్యాండ్ స్థలాల అక్రమనలపై ఎంసిపిఐ(యు) ఆందోళన

  • కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ కు వినతి

నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట పట్టణంలోని గ్రీన్‌ల్యాండ్ స్థలాలు రోజురోజుకు అన్యాక్రాంతమవుతున్నాయని, వాటిని రక్షించడంలో మున్సిపల్ అధికారులు ఘోర వైఫల్యం చెందు తున్నారని ఎంసీపీఐ(యు) నేతలు ఆరోపించారు. గ్రీన్‌ల్యాండ్ స్థలాలను కాపాడాలని, ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఎంసీపీఐ(యు) నర్సంపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ, డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి మాట్లాడుతూ పట్టణంలోని కాకతీయ కాలేజీ వెనుక ఉన్న సుమారు 30 గుంటల గ్రీన్‌ల్యాండ్ స్థలం ఇప్పటికే ఆక్రమణకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టణంలో మరికొన్ని గ్రీన్‌ల్యాండ్ స్థలాలు కూడా కబ్జాలకు గురవు తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిలువ నీడలేని నిరుపేదలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటే కేసులు నమోదు చేసే అధికారులు, బడాబాబులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా నిర్మాణాలు కొనసాగిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రీన్‌ల్యాండ్ స్థలాలను కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ టౌన్ కమిటీ సభ్యులు కల్లేపల్లి రాకేష్, పుట్టపాక సునీత, గడ్డం స్వరూప తదితరులు పాల్గొన్నారు.