గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ…

మడకశిర, జులై 15 (ఆంధ్రప్రభ ): శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం లోని అమరాపురం మండలంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు ఇ.లక్ష్మీరెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి, ఆహార నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలుపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వంటశాల, భోజనశాల, నిల్వ గదులను పరిశీలించిన ఆయన, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థినులకు భోజనం అందిస్తున్నారా, ఆహారం నాణ్యంగా, రుచికరంగా ఉందా అనే విషయాలను విద్యార్థినులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా, మెనూ ప్రకారం అన్ని పదార్థాలు అందుతున్నాయా అనే అంశాలపై వారితో మాట్లాడారు.

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ఆహారం అందించడం అత్యంత ముఖ్యమని లక్ష్మీరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఆహార ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఆహార పదార్థాల నిల్వ, వంట ప్రక్రియ, పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని సంబంధిత సిబ్బందికి సూచించారు.

విద్యార్థులకు పోషకాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, విద్యాభివృద్ధికి తోడ్పడాలని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నాణ్యత లేని ఆహారం అందించినా లేదా ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించినా సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు.