వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన సదస్సు

ప్రత్యామ్నాయ పంటలు, పంట మార్పిడిపై అధికారుల సూచనలు

తొర్రూరు రూరల్, ఆంధ్రప్రభ : మండలంలోని మడిపల్లి గ్రామంలో సర్పంచ్ నలుగురి రామలింగం అధ్యక్షతన బుధవారం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, పంట మార్పిడి విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి వి. ప్రవీణ్, నీటిపారుదల శాఖ ఏఈఈ గోపి పాల్గొని ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా తక్కువ నీటితో మెరుగైన దిగుబడులు సాధించవచ్చని వివరించారు. అలాగే పంట మార్పిడి విధానాన్ని పాటించడం వల్ల భూసారం పరిరక్షించబడటంతో పాటు పంటల దిగుబడి, రైతుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం జారీ చేస్తున్న సూచనలు, వ్యవసాయ శాఖ అందిస్తున్న సేవలు, వర్షాభావ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమగ్ర పంట నిర్వహణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, రైతులు, గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.