Youth Congress | శివచరణ్‌రెడ్డికి ఐవైసీ షోకాజ్ నోటీసు
బీసీ వర్గాలు, మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు
మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ వివాదం నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలకు శ్రీకారం
Youth Congress | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డికి ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీసీ వర్గాలు, మహిళా నాయకురాలు, పార్టీ సీనియర్ నాయకులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మూడు రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది.
యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌కు సంబంధించిన ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో శివచరణ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరిగింది. ఈ ఘటనపై బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
ఆరోపణల ప్రకారం, ఈశ్వరమ్మ యాదవ్ ఫ్లెక్సీలో కాంగ్రెస్ నాయకుడు జక్కిడి ప్రభాకర్‌రెడ్డి ఫొటో లేకపోవడంపై శివచరణ్‌రెడ్డి అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు ప్రచారం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈశ్వరమ్మ యాదవ్ అనుచరులు ఎల్బీనగర్‌లోని మన్సూరాబాద్‌లో ఉన్న శివచరణ్‌రెడ్డి నివాసానికి చేరుకుని నిరసన వ్యక్తం చేయగా, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగినట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఇండియన్ యూత్ కాంగ్రెస్, శివచరణ్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసి మూడు రోజుల్లోగా తన వివరణ సమర్పించాలని ఆదేశించింది. వివరణ అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
