ప్రజల కోసం ప్రాణమున్నంత వరకు పోరాటం చేస్తా..
జైల్లో పెట్టినా ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కోట్లాడతా … బెదిరింపులతో నా గొంతు నొక్కలేరు
ఆంధ్ర పాలకులను మించి పోయిన రేవంత్ సర్కార్
ఉద్యమాలు, పోరాటాలు, అరెస్టులు బిఆర్ఎస్ కొత్త కాదు…
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్,భీంగల్ రూరల్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో భీంగల్ ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వైఖరికి నిరసనగా మాజీ మంత్రి , బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఒక్కరోజు నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసే ప్రయత్నం చేశారు. వేల్పూర్ లోని ప్రశాంత్ రెడ్డి నివాసాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని ప్రశాంత్ రెడ్డి ప్రకటించినట్టుగానే ఆయన నివాసంలో ఉదయం 10 గంటలకు నిరహార దీక్ష ప్రారంభించారు. బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు చేస్తున్నారు. దీనిపై ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోనే నిరహార దీక్ష చేపట్టిన ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రాణమున్నంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటానని వేముల స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా సమస్యల కోసం తనను జైళ్లో పెట్టినా ప్రభుత్వంపై కొట్లాడుతూనే ఉంటానని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆంధ్ర పాలకులు ఇంతటి నిర్బంధాన్ని విధించలేదని, రేవంత్ సర్కార్ దుర్మార్గంగా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని నిర్బంధాలు చేసినా నా గొంతు నొక్కలేరని అన్నారు.
తాము ఉద్యమ అధినేత కేసీఆర్ దగ్గర ఉద్యమ పాఠాలు నేర్చుకున్నామని, ఆయన చూపిన మార్గంలోనే ఆనాడు స్వరాష్ట్రం కోసం పోరాటం చేశాం… నేడు ప్రజా సమస్యల కోసం రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. గృహ నిర్బంధంలో ఉన్నా నా దీక్ష కొనసాగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే శాంతియుత దీక్ష చేపట్టాను. పోలీసుల నిర్బంధం అప్రజాస్వామికంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. భీంగల్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అడిగితే అరెస్టులు చేస్తారా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో హామీ ఇవ్వాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వంద పడకల ఆసుపత్రి, వెజ్ నాన్ వెజ్ మార్కెట్,బస్ డిపో, సిసి రోడ్లు పనులు పూర్తి చేయాల్సిందే. లేకపోతే పోరాటం ఆగదని హెచ్చరించారు. భీంగల్ లో రాత్రికి రాత్రే దీక్షా శిబిరం కూల్చివేసారు.
బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. బాల్కొండ నియోజకవర్గం మరియు భీంగల్ ప్రజల దశాబ్దాల కల అయిన అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తాను తలపెట్టిన శాంతియుత ‘కఠోర నిరాహార దీక్ష’ను పోలీసు బలగాలతో అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, రాక్షస చర్య అని బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యల సాధన కోసం తాను అహింసా మార్గంలో నిరసన తెలియజేస్తుంటే, ప్రభుత్వం పోలీసులతో ఉక్కుపాదం మోపాలని చూడటం శోచనీయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై, దాదాపు 75 శాతం పనులు పూర్తి చేసుకున్న భీంగల్ 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. భీంగల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయాలని, మూతపడిన భీంగల్ బస్ డిపోను పునఃప్రారంభించాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గత మున్సిపల్ ఎన్నికల ముందు రూ. 12 కోట్ల నిధులతో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ పెండింగ్ పనుల సాధన కోసమే చుక్క మంచి నీరు కూడా ముట్టకుండా ఒక రోజు కఠోర నిరాహార దీక్షకు పూనుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఎలాంటి రాస్తారోకోలు, ధర్నాలు చేయకుండా, తనకు తాను శిక్ష వేసుకుంటూ అత్యంత శాంతియుతంగా ఒకరోజు దీక్ష చేస్తానని ప్రకటిస్తే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తాను ఉదయం నిద్రలేవక ముందే, కనీసం స్నానం కూడా చేయకముందే వందలాది మంది పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టి తనను బయటకు వెళ్లనివ్వకుండా గృహ నిర్బంధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేసి జైళ్లలో పెడుతున్నారని, భీంగల్ లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని తొలగించి, ఫ్లెక్సీలను సైతం చించేయడం ప్రభుత్వ రాక్షసత్వానికి నిదర్శనమన్నారు.ప్రభుత్వానికి నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ అభివృద్ధి పనులను నెల లేదా రెండు నెలల్లో పూర్తి చేస్తామని అధికారికంగా స్పష్టమైన హామీ ఇస్తే తాను ఆందోళన విరమిస్తానని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. అది చేతకాక, పోలీసులతో బెదిరిస్తే భయపడేది లేదని తేల్చిచెప్పారు. ప్రజా ప్రతినిధిగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. భీంగల్ పట్టణ, మండల ప్రజలు, యువత, కుల సంఘాలు, వీడీసీ సభ్యులు, మరియు బాల్కొండ నియోజకవర్గ ప్రజలందరూ ఈ న్యాయమైన పోరాటానికి మరియు నిరాహార దీక్షకు మనస్ఫూర్తిగా మద్దతు తెలపాలని వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
