ఎండుతున్న సోయా పంటలు.. వాన కోసం రైతుల ఎదురుచూపులు

బాసర (నిర్మల్ జిల్లా): మండల పరిధిలోని రైతులు ప్రధానంగా వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో కురిసిన వర్షాలతో ఉత్సాహంగా సుమారు 1,500 ఎకరాలకు పైగా సోయా పంటను సాగు చేశారు. అయితే గత రెండు వారాలుగా వర్షాలు లేకపోవడంతో పొలాల్లో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరో వారం రోజులపాటు కూడా వర్షాలకు అనుకూల పరిస్థితులు కనిపించకపోవడంతో పంటల పరిస్థితి మరింత దిగజారుతుందేమోనని అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. సకాలంలో వర్షాలు కురిస్తేనే పంటలు కోలుకునే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.

మండలంలోని పలు గ్రామాల్లో వర్షాల కోసం రైతులు, మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వరుణుడు కరుణించి వర్షాలు కురిపించాలని ప్రార్థిస్తూ మంచి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.