Jammu Kashmir | రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రత నమోదు..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జమ్మూకశ్మీర్‌లో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. బారాముల్లా జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదవడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది.
అధికారుల వివరాల ప్రకారం, బారాముల్లా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్‌కు ఉత్తర-ఈశాన్య దిశలో సుమారు 23 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు కేంద్రీకృతమైనట్లు తెలిపారు.
అర్ధరాత్రి తర్వాత భూమి స్వల్పంగా కంపించడంతో బారాముల్లా, సరిహద్దు ప్రాంతాల ప్రజలు గాఢ నిద్రలో నుంచే ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు లేదా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని అధికారులు సూచించారు.
