తుపాకులగూడెం వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రుల బృందం

దేవాదుల ప్రాజెక్టు పనులు, నీటి ఎత్తిపోతలపై అధికారులతో సమీక్ష

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టును సందర్శించారు. తుపాకులగూడెం వద్ద గోదావరి నదిలో ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రులు ప్రాజెక్టు పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులతో సమావేశమై నీటి ఎత్తిపోతలపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్వహణ, నీటి సరఫరా, తదుపరి కార్యాచరణపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం గంగారం వద్ద దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించిన ఇంటెక్ వెల్‌ను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.

మంత్రుల వెంట ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.