భరోసా మాత్రమేనా.. బాసటగా నిలుస్తారా..?

నేడు, రేపు సింగరేణి పర్యటనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తాడిచర్ల బొగ్గు బ్లాక్ కేటాయింపు నేపథ్యంలో పర్యటన

తమ సమస్యపై దృష్టి సారించాలని డిస్మిస్ కార్మికుల వేడుకోలు

నాలుగేళ్లుగా ఉద్యోగాలు కోల్పోయి కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు

కేంద్ర మంత్రి జోక్యంతో న్యాయం జరుగుతుందనే ఆశాభావం

మంచిర్యాల, ఆంధ్రప్రభ: సింగరేణి వ్యాప్తంగా విధుల నుంచి తొలగించబడిన (డిస్మిస్) కార్మికులు మరోసారి ఆశతో ఎదురుచూస్తున్నారు. తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమ, మంగళవారాల్లో సింగరేణి ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తమ సమస్యను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపించాలని డిస్మిస్ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ ఉద్యోగాలు కోల్పోయి నాలుగేళ్లకు పైగా అవుతున్నా ఇప్పటికీ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్నాయని, ఈ పర్యటన తమకు చివరి ఆశగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2019 నుంచి 2022 మధ్యకాలంలో సింగరేణి వ్యాప్తంగా సుమారు 156 మంది కార్మికులను విధుల నుంచి తొలగించినట్లు బాధితులు చెబుతున్నారు. అనారోగ్యం, కుటుంబ పరిస్థితులు, కరోనా మహమ్మారి సమయంలో నెలకొన్న భయాందోళనల కారణంగా విధులకు హాజరు కాలేకపోయామని, అయితే వాటిని పరిగణనలోకి తీసుకోకుండా గైర్హాజరును కారణంగా చూపి ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని వారు వాపోతున్నారు. తాము ఉద్దేశపూర్వకంగా విధులను విస్మరించలేదని, సంస్థ కోసం ఎన్నో సంవత్సరాలు శ్రమించిన తమ సేవలను ఒక్కసారిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత కుటుంబాల పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, అప్పుల భారం వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు.

వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌పై ఆశలు… అమలులో నిరాశ

డిస్మిస్ కార్మికుల వినతులు, అప్పటి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ చేసిన ప్రతిపాదనల నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) విధానాన్ని తీసుకొచ్చింది. 2023 అక్టోబర్ 3న జారీ చేసిన సర్క్యులర్ ద్వారా 2019 జనవరి 1 నుంచి 2022 డిసెంబర్ 31 మధ్య డిస్మిస్ అయిన కార్మికులకు తిరిగి ఉద్యోగాల్లోకి వచ్చే అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. అయితే ఆ సర్క్యులర్‌లో విధించిన నిబంధనల కారణంగా చాలా మంది కార్మికులు అర్హత కోల్పోయారని బాధితులు ఆరోపిస్తున్నారు.

డిస్మిస్ సమయంలో 46 ఏళ్లలోపు వయస్సు ఉండడం, గత ఐదేళ్లలో నిర్దిష్ట సంఖ్యలో మాస్టర్లు ఉండడం వంటి షరతులు విధించడం వల్ల ఎక్కువ మంది కార్మికులు లబ్ధి పొందలేకపోయారని అంటున్నారు. ఒకవైపు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి, మరోవైపు అమలు కాని నిబంధనలతో అవకాశాలను మూసివేయడం ద్వారా యాజమాన్యం చేతులు దులుపుకుందని విమర్శిస్తున్నారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కేవలం పేరుకే పరిమితమైందని, అమలులోకి తీసుకురావడంలో అధికారులు చిత్తశుద్ధి చూపలేదని ఆరోపిస్తున్నారు.

మంత్రి చొరవతోనే న్యాయం జరుగుతుందనే ఆశ

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనపై డిస్మిస్ కార్మికులు భారీ ఆశలు పెట్టుకున్నారు. తమ సమస్యను ప్రత్యక్షంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లి, సింగరేణి యాజమాన్యంతో చర్చించి ఉద్యోగాల్లోకి తిరిగి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌ను వాస్తవంగా అమలు చేయించి, అర్హులైన కార్మికులకు తిరిగి ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉద్యోగాలు కోల్పోయి సంవత్సరాలు గడుస్తున్నా తమ కుటుంబాలు ఇంకా ఆర్థికంగా కోలుకోలేదని, కేంద్ర మంత్రి చొరవ తీసుకుంటే దాదాపు 200 మంది డిస్మిస్ కార్మికుల కుటుంబాలకు మళ్లీ జీవనాధారం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాడిచర్ల బొగ్గు బ్లాక్ కేటాయింపుతో సింగరేణికి కొత్త అవకాశాలు లభిస్తున్న ఈ సమయంలో, తమ జీవితాల్లో కూడా కొత్త ఆశలు నింపేలా నిర్ణయం తీసుకోవాలని డిస్మిస్ కార్మికులు వేడుకుంటున్నారు.