వాగ్దానాలు అమలు చేయని కాంగ్రెస్‌ను గద్దె దింపాలి

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ, ఆంధ్రప్రభ: ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను ఆకర్షించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేవలం రెండున్నరేళ్లలోనే తెలంగాణను ఎన్నో సంవత్సరాలు వెనక్కి నెట్టిందని ఆయన పేర్కొన్నారు.

రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యవసాయ కూలీలు, వృద్ధులు, ఉద్యోగులు, పోలీస్ కానిస్టేబుళ్లు తదితర అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త మొబైల్ ఫోన్‌ను ఆయుధంగా ఉపయోగించుకోవాలని, ట్విట్టర్ (ఎక్స్), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు.