ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

లక్నేపల్లిలో రూ.10 లక్షలతో మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన..

మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సంఘం భవనానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు శాశ్వత వేదిక కల్పించి, స్వయం ఉపాధి కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళల ఆర్థిక సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

ప్రతి మహిళ స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని సూచించిన ఎమ్మెల్యే, ఇంటి ఆవరణలో కూరగాయల సాగు, పాడి పరిశ్రమ, గేదెల పెంపకం, కోళ్ల పెంపకం చేపట్టి అదనపు ఆదాయాన్ని పొందాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు.

మహిళా సంఘాలు మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో గ్రామాల్లో సంఘ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని, మహిళల సంక్షేమం, సాధికారత కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు.

అనంతరం మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.