వరద కాలువ ఆక్రమణలపై స్థానికుల ఆందోళన

నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ద్వారకపేట గ్రామంలోని వరద మురికి కాలువ ఆక్రమణలకు గురవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుమ్మరి కుంట నుంచి ప్రారంభమై ద్వారకపేట స్మశానవాటిక పక్కగా, పసునూరు, జాలుబంధం శివారు ప్రాంతాల మీదుగా వెళ్లే ఈ కాలువలో కొంత భాగం ఆక్రమణకు గురైందని ఆరోపిస్తున్నారు.

స్థానికుల కథనం ప్రకారం, గతంలో మున్సిపల్ అధికారులు ఈ వరద కాలువను సుమారు 20 అడుగుల వెడల్పుతో ఎంఏఆర్ ఫంక్షన్ హాల్ వరకు అభివృద్ధి చేశారు. అనంతరం కాలువలోని కొంత భాగాన్ని ఆక్రమించారని, ముఖ్యంగా మోతే సంపత్ రెడ్డి ఆక్రమించిన ప్రాంతంలో కాలువను అసలు వెడల్పుతో తవ్వకుండా వదిలేశారని పేర్కొంటున్నారు.

ఈ వ్యవహారంపై గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ, తహసీల్దార్, ఐబీ అధికారులు, మున్సిపల్ కమిషనర్ సమక్షంలో కాలువ సరిహద్దులను గుర్తించి హద్దురాళ్లు ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు. అయితే అనంతరం ఆ హద్దురాళ్లను తొలగించి, కాలువ అసలు వెడల్పును మార్చే విధంగా మళ్లీ తవ్వకాలు చేపట్టారని ఆరోపించారు.

మున్సిపల్ కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలతో కాలువ మార్గంలో మార్పులు చేసి ఆక్రమణలకు అవకాశం కల్పిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. దీంతో భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు సక్రమంగా వెళ్లక పరిసర కాలనీలు నీటమునిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాలువ అసలు వెడల్పును పునరుద్ధరించి, ఆక్రమణలను తొలగించాలని, ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.