గజలమ్మ ఆలయంలో భక్తుల సందడి.. ప్రత్యేక పూజలు
కుంటాల, ఆంధ్రప్రభ : కుంటాల మండలంలోని గజలమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, హారతి, పల్లకి సేవతో పాటు వివిధ పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మొక్కులు చెల్లించి నైవేద్యాలు సమర్పించారు.
సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, కుటుంబాల్లో సుఖసంతోషాలు నెలకొనాలని అమ్మవారిని వేడుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
అదేవిధంగా మండలంలోని ముత్యాలమ్మ, మహాలక్ష్మి, పెద్దమ్మ తల్లి ఆలయాలతో పాటు వివిధ గ్రామాల్లోని గ్రామదేవతల ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు నైవేద్యాలు సమర్పించి, గ్రామాల్లో సుభిక్షం నెలకొనాలని ప్రార్థనలు చేశారు.
