MaaIntiBangaram| తెలుగు సినీ చరిత్రలో కొత్త అధ్యాయం
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సినిమా కథలో హీరోనే ప్రధాన ఆకర్షణ అన్న అభిప్రాయాన్ని మార్చేస్తూ.. మహిళా ప్రధాన కథతో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుని, ఈ ఫీట్ సాధించిన తొలి తెలుగు మహిళా ప్రధాన చిత్రంగా నిలిచినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.
సమంత బేబీ బంబ్స్ తో తన 100 కోట్ల పోస్టర్ రివీల్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విజయంతో సమంత మరోసారి తన స్టార్‌డమ్‌ను నిరూపించుకున్నారు. బలమైన కథ, భావోద్వేగాలకు ప్రాధాన్యం, వినోదాత్మక అంశాలు కలిసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, వీకెండ్లు గడిచినా కలెక్షన్లలో స్థిరత్వాన్ని కొనసాగించింది.

ఈ చిత్రానికి రాజ్ క్రియేటివ్ విజన్, నందిని రెడ్డి కథన శైలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణతో పాటు కుటుంబ ప్రేక్షకుల మద్దతు కూడా ఈ విజయానికి ప్రధాన కారణంగా మారింది.
రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం ద్వారా ‘మా ఇంటి బంగారం’ కేవలం కమర్షియల్ విజయమే కాకుండా, మహిళా ప్రధాన కథలకూ భారీ మార్కెట్ ఉందనే విషయాన్ని మరోసారి చాటింది. ఈ విజయం తర్వాత ఇలాంటి కథలపై నిర్మాతలు మరింత ఆసక్తి చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
