గీతకార్మికుడి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ..
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గీతకార్మికుడు పెరుమాండ్ల రాజకుమార్ ఇటీవల తాటిచెట్టు పైనుండి ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాజకుమార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన చల్లా ధర్మారెడ్డి, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
అనంతరం ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రాజకుమార్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం, సంక్షేమ పథకాల ద్వారా పూర్తి స్థాయిలో ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
