జిల్లాలో 250 మంది విద్యా వాలంటీర్లను నియమించాలి

మక్తల్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో 250 మంది విద్యా వాలంటీర్లను నియమించి ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా శాఖ రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిని కోరింది. ఆదివారం మక్తల్‌లో తపస్ నాయకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. విధుల సర్దుబాటులో భాగంగా ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న పీటీఐలను ఇతర పాఠశాలలకు బదిలీ చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా జిల్లాలోని కొత్త మండలాలైన కృష్ణ, కొత్తపల్లి, గుండుమాల్ మండల వనరుల కేంద్రాలకు (ఎంఆర్సీ) భవనాలు నిర్మించి అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు. విద్యా వాలంటీర్ల నియామక అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శేర్ కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నరసింహా, జిల్లా కార్యదర్శి బి. రవీందర్, మక్తల్ మండల అధ్యక్షుడు నర్సింలు, కార్యదర్శి రాకేష్ కుమార్, జిల్లా నాయకులు వి. భీమ్ రెడ్డి, నాగార్జున, వెంకట్రాములు, రాము, రాజాంజనేయులు, ప్రవర్ధన్ రెడ్డి, రామాంజనేయులు, రవీందర్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.