OTT | కేంద్రం కొత్త ప్రతిపాదనపై ఇండస్ట్రీలో చర్చ

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: ఇప్పుడు ఎక్కువ మంది సినిమాలను థియోటర్లలో కంటే ఓటీటీలలో చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో సినిమా విడుదలైనచ నెల లోపే ఓటీటీలోకి రావడం లేదా.. నేరుగా ఓటీటీలోనే విడుదలైన సందర్బాలు అధికం. సినిమా, వెబ్‌ సిరీస్‌ నేరుగా ఓటీటీలోకి రావడానికి అందులోని సన్నివేశాలపై ఏలాంటి స్వీయనియంత్రణ లేదు. అయితే ఓటీటీలో స్వీయ నియంత్రణ (Self-Regulation) విధానాన్ని మరింత కట్టుదిట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లు, డిజిటల్ సినిమాలు విడుదలకు ముందు సెన్సార్ లేదా ముందస్తు అనుమతి విధానాన్ని అమలు చేయాలా అనే అంశంపై సంబంధిత వర్గాలతో సంప్రదింపులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఎందుకు ఈ ఆలోచన..?

ఇటీవల కొన్ని వెబ్ సిరీస్‌లు, ఓటీటీ సినిమాల్లో హింస, అసభ్య పదజాలం, నగ్నత, మతపరమైన అంశాల చిత్రీకరణపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పలు సందర్భాల్లో ప్రేక్షకులు, సామాజిక సంస్థలు, ప్రజాప్రతినిధులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డిజిటల్ కంటెంట్‌పై మరింత పర్యవేక్షణ అవసరమా అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మారే అవకాశం ఉన్న విధానం…

ప్రస్తుతం ఓటీటీ సంస్థలు సమాచార సాంకేతిక (IT) నిబంధనల ప్రకారం స్వీయ నియంత్రణ వ్యవస్థలోనే కంటెంట్‌ను విడుదల చేస్తున్నాయి. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే, వెబ్ సిరీస్‌లు, డిజిటల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ముందు అనుమతి, సర్టిఫికేషన్ పొందాల్సి వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక నిర్ణయం వెలువడలేదు.

ఇండస్ట్రీలో ఆందోళన..

మరోవైపు ఈ ప్రతిపాదనపై దర్శకులు, నిర్మాతలు, ఓటీటీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సినిమా విడుదలకు ముందు ఇప్పటికే థియేటర్ల కోసం సెన్సార్ విధానం అమల్లో ఉండగా, ఓటీటీలకూ అదే తరహా నిబంధనలు తీసుకురావడం వల్ల సృజనాత్మక స్వేచ్ఛకు పరిమితులు ఏర్పడే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రత్యేకత తగ్గిపోతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

ఒకవైపు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, మరోవైపు సృజనాత్మక స్వేచ్ఛకు సంబంధించిన ఆందోళనలు… ఈ రెండు అంశాల మధ్య సమతుల్యత ఎలా సాధిస్తుందన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రతిపాదన అమలులోకి వస్తుందా? లేక ప్రస్తుత స్వీయ నియంత్రణ వ్యవస్థలోనే మార్పులు చేస్తారా? అనే అంశాలపై వినోద రంగంతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.