Article 309 | హిమాచల్ ప్రదేశ్‌లో జీతాల కోత నిర్ణయం

Article 309 | హిమాచల్ ప్రదేశ్‌లో జీతాల కోత నిర్ణయం
Article 309 | 20% నుంచి 30% వరకు తగ్గింపు
ఆరు నెలల పాటు అమలు
కొవిడ్ తరహా చర్యల పునరావృతం
ఆర్థిక క్రమశిక్షణ లోపం ప్రభావం
పెరుగుతున్న అప్పులు.. అభివృద్ధిపై ప్రభావం
Article 309 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : దేశంలోని అనేక రాష్ట్రాలు ఆర్థిక ఒత్తిడిను ఎదుర్కొంటున్న పరిస్థితిలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక లోటు కారణంగా ఆ రాష్ట్రం ఉన్నతాధికారుల జీతాల్లో కోత విధించేందుకు ముందుకొచ్చింది. ఆర్టికల్ 309 ఆధారంగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, ఆరు నెలల పాటు 20% నుంచి 30% వరకు జీతాల్లో కోత అమలు కానుంది. మే నెల జీతాల నుంచి ఇది అమల్లోకి రానుంది. మూడో, నాలుగో తరగతి ఉద్యోగులను మినహాయించి మిగతా అధికారులందరికీ ఈ కోత వర్తిస్తుంది.
ఈ కోత ద్వారా నిలిపివేసిన మొత్తాన్ని ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదనపు ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, అటవీ మరియు పోలీసు శాఖల ఉన్నతాధికారులు 30% వరకు జీతం కోతను ఎదుర్కొంటారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో కూడా తగ్గింపు అమలు చేశారు. ఇక ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులు, పోలీసు శాఖలో ఐజీ, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు, అటవీ శాఖలో డీఎఫ్‌ఓ స్థాయి అధికారులకు 20% కోత వర్తిస్తుంది. ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఉన్నతాధికారులకూ ఇదే విధానం అమలు చేయనున్నారు.
కొవిడ్ సమయంలోనూ ఇదే దారి…
కొవిడ్ మహమ్మారి సమయంలో కూడా అనేక రాష్ట్రాలు ఇలాంటి చర్యలు చేపట్టాయి. లాక్‌డౌన్ కారణంగా ఆదాయం తగ్గిపోవడంతో కొందరు ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా జీతాల్లో కోత పెట్టుకున్నారు. మరికొన్ని రాష్ట్రాలు ఉద్యోగుల జీతాలను తగ్గించాయి. ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడినప్పుడు కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాయి.
ఆర్థిక క్రమశిక్షణ లోపమే ప్రధాన కారణం..
ప్రస్తుతం అనేక రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ ఆదాయం ఎక్కువగా జీతాలు, పెన్షన్లకే ఖర్చవుతోంది. మరోవైపు ప్రజాకర్షక పథకాలు, ఉచితాల అమలుతో ఖర్చులు మరింత పెరుగుతున్నాయి. కేంద్ర సహాయం, గ్రాంట్లు, పన్నుల వాటాలు ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాలకు ఇవి సరిపోవడం లేదు. దాంతో అప్పులు తీసుకుని సంక్షేమ పథకాలను కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది.
అప్పుల పెరుగుదలతో ఆర్థిక ఒత్తిడి..
రాష్ట్రాలపై అప్పుల భారం రోజురోజుకూ పెరుగుతోంది. వడ్డీలు, అసలు చెల్లింపుల కోసం ప్రతి ఏడాది భారీ మొత్తాలు వెచ్చించాల్సి వస్తోంది. ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులపై ఖర్చు తగ్గిపోతోంది. రెవెన్యూ కంటే వ్యయం అధికంగా ఉండటం మరో పెద్ద సమస్యగా మారింది. వేల కోట్ల రూపాయల లోటుతో అనేక రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఆర్థిక నియంత్రణ పాటించాలని హెచ్చరించింది కూడా. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించడం కూడా కష్టంగా మారింది.
