జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ 91 శాతం పూర్తి

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, డిజిటలైజేషన్‌తో పాటు క్షేత్రస్థాయి ధృవీకరణ కలిపి మొత్తం పురోగతి 91 శాతానికి చేరుకుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 13,40,126 మంది ఓటర్లలో ఇప్పటివరకు 11,39,840 మంది (84.37 శాతం) వివరాలను డిజిటలైజ్ చేశామని, క్షేత్రస్థాయి పరిశీలనతో కలిపి మొత్తం 91 శాతం ప్రక్రియ పూర్తైందన్నారు. మిగిలిన ప్రక్రియను మరో రెండు రోజుల్లో పూర్తి చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇంకా పరిశీలనలో ఉన్న ఓటర్లలో సుమారు 27 వేల మంది మరణించినవారు, 15–16 వేల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, 10 వేల మంది ఇతర నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదైనవారు, 3 వేల మంది చిరునామాలో అందుబాటులో లేనివారు ఉన్నారని పేర్కొన్నారు. వీరి వివరాలను నిబంధనల ప్రకారం పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

నియోజకవర్గాల వారీగా నగరిలో 87.01 శాతం, గంగాధర నెల్లూరులో 85.96 శాతం, పూతలపట్టులో 85.32 శాతం, పలమనేరులో 84.10 శాతం, కుప్పంలో 82.23 శాతం, చిత్తూరులో 81.70 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని కలెక్టర్ వెల్లడించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓటర్లు లేదా వారి కుటుంబ సభ్యులు సంబంధిత ఫారంపై తప్పనిసరిగా సంతకం చేయాలని, లేకపోతే వారి పేరు ముసాయిదా ఓటరు జాబితాలో ఉండకపోవచ్చని హెచ్చరించారు. ఇంకా అవకాశం ఉన్నందున సంబంధిత బీఎల్‌వోలు లేదా ఎన్నికల సిబ్బందిని సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జూలై 13, 14, 15 తేదీల్లో కూడా ఎస్‌ఐఆర్‌ పురోగతిపై మీడియా బులెటిన్లు విడుదల చేస్తామని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించామని, ఇప్పటివరకు ఎలాంటి నిర్దిష్ట ఫిర్యాదులు అందలేదన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహిస్తూ, ప్రతి నియోజకవర్గంలో రాజకీయ పార్టీలతో సమీక్షలు నిర్వహించి అభ్యంతరాలను పరిష్కరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.