అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: సీఐ

ఉట్నూర్, (ఆంధ్రప్రభ): ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, చట్టాలను ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఇంకర్‌గూడలో ఆదివారం ఉట్నూర్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డన్ అండ్ సెర్చ్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు సుమారు 30 మంది పోలీసు సిబ్బందితో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో మూడున్నర లీటర్ల గుడుంబాతో పాటు రెండు కిరాణా దుకాణాల నుంచి సుమారు రూ.42 వేల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడిన సీఐ మడావి ప్రసాద్ యువత గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. దొంగతనాలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో జీవించాలని, నేరాలకు సంబంధించిన సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నంబర్ ప్లేట్ లేకుండా లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఎస్సై గుంపుల విజయ్, ఇంద్రవెల్లి ఎస్సై సాయన్న, పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.