ఎస్‌ఐఆర్ ఓటర్ సర్వేకు సహకరించాలి
కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలంలోని పెద్ద బెల్లాల్ గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ సర్వేకు గ్రామ ప్రజలందరూ సహకరించాలని గ్రామ సర్పంచ్ ఈదుల తిరుపతి కోరారు. మంగళవారం స్థానిక బీఎల్‌ఓ షహనాజ్ బేగంతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్లకు సర్వే ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని, అవసరమైన ధ్రువపత్రాలను స్థానిక బీఎల్‌ఓకు అందజేసి సర్వేను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం పారదర్శకంగా, ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. బీఎల్‌ఓ షహనాజ్ బేగం ఎస్‌ఐఆర్ ఫారాలు నింపే విధానం, అవసరమైన పత్రాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించగా, ప్రజలు సర్వేకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
