Kanaka Durga Temple | భక్తజన సందోహంతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి..
Kanaka Durga Temple |విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి శనివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారాంతపు సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో ఆలయ ప్రాంగణంతో పాటు ఇంద్రకీలాద్రి, కనకదుర్గ నగర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిశాయి.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆలయ ఏసీ రంగారావు ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసి, రద్దీ నియంత్రణకు అవసరమైన చర్యలు అమలు చేశారు.

శనివారం రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ సాయికుమార్, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరా దేవి తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదిలా ఉండగా, దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. కమిషనర్ పర్యటనలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా గాంధీతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.


