Vietnam-Boat-Vccident : నాన్న వస్తారని ఎదురుచూస్తున్న పిల్లలు Andhra Prabha Sad News

Vietnam-Boat-Vccident : నాన్న వస్తారని ఎదురుచూస్తున్న పిల్లలు Andhra Prabha Sad News

  • రవి తేజ కోసం.. కుటుంబం కన్నీరు మున్నీరు
  • మరణవార్తపై అస్పష్టత
  • సహచరుల చావుకబురు
  • వియత్నాం బోటు బోల్తా ఘోరం
  • తెలుగు రాష్ట్రాల్లో విషాదం
  • హిందూపురంలో విషాదం .
  • అధికారిక ధృవీకరణ కోసం ఎదురుతెన్నులు

( శ్రీ. సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ):

Vietnam-Boat-Vccident : వియత్నంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దక్షిణ వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో పర్యాటకులతో వెళ్తున్న స్పీడ్‌బోటు బోల్తా పడటంతో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది భారతీయులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం వెలువడగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.
మృతుల్లో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన రవితేజ ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆయన మరణంపై భారత విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయం నుంచి అధికారిక ధృవీకరణ కోసం కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.
సమాచారం ప్రకారం, ప్రముఖ మొబైల్ సంస్థ లావా కార్పొరేట్ డిస్ట్రిబ్యూటర్ల ప్రత్యేక టూర్‌లో భాగంగా మూడు రోజుల క్రితం రవితేజతో పాటు పలువురు భారతీయులు వియత్నం వెళ్లారు. పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్న సమయంలో సముద్ర విహారానికి బయలుదేరిన స్పీడ్‌బోటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. బలమైన గాలులు, ఎత్తైన అలలు ప్రమాదానికి కారణమై ఉండొచ్చని స్థానిక అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నారనే సమాచారం వెలువడటంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హిందూపురంలో రవితేజ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రవితేజకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన వియత్నాం అధికారులు పలువురిని సురక్షితంగా రక్షించారు. మృతదేహాలను వెలికితీసి గుర్తింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. భారత రాయబార కార్యాలయం ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తున్నట్లు సమాచారం.
హిందూపురంలో రవితేజ మృతి వార్త తెలిసిన వెంటనే బంధువులు, స్నేహితులు, స్థానికులు ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. అధికారిక ప్రకటన అనంతరం మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు చేపట్టనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు