ఇంద్రకీలాద్రికి ఆధ్యాత్మిక శోభ
ఆలయ భవనాలన్నింటికీ ఒకే తరహా రంగులే..
దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్.
లడ్డూ పోటు, అన్నదాన భవనం, మహామండపం పనుల పరిశీలన
భక్తులకు ప్రశాంతతను పంచే ఆధ్యాత్మిక వాతావరణమే లక్ష్యం
లడ్డూ పోటు సెల్లార్‌ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలి
అభివృద్ధి పనుల్లో నాణ్యత, వేగం, పెంచాలి
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా ఆలయ సముదాయంలోని అన్ని నూతన భవనాలకు ఒకే తరహా రంగులు ఉండాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ స్పష్టం చేశారు. భక్తులకు కళ్లకు ఆహ్లాదం, మనసుకు ప్రశాంతతను కలిగించే రంగులనే ఎంపిక చేయాలని, లడ్డూ పోటు, అన్నదాన భవనం, మహామండపం వేర్వేరు నిర్మాణాలుగా కాకుండా ఒకే ఆధ్యాత్మిక రూపకల్పనతో కనిపించేలా పనులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
శనివారం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న వివిధ ప్రతిష్ఠాత్మక అభివృద్ధి పనులను కమిషనర్ కే రామచంద్ర మోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. పర్యటనలో భాగంగా ముందుగా నూతన లడ్డూ పోటు భవనాన్ని సందర్శించిన కమిషనర్, భవనం బయటి రంగులు, అంతర్గత గోడల రంగులు, ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు. లడ్డూ పోటు సెల్లార్‌ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి భక్తుల అవసరాలకు అనుగుణంగా ఉపయోగించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
అనంతరం నూతన అన్నదాన భవనంలో జరుగుతున్న ఫ్లోరింగ్, రంగుల పనులను పరిశీలించిన ఆయన, మహామండపం ఏడో అంతస్తులోని ప్రాకార ప్రాంతాన్ని సందర్శించి ఇప్పటికే ఉన్న రంగుల నమూనాలను పరిశీలించారు. వాటికి అనుగుణంగా కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు కూడా అదే తరహా రంగులు ఉపయోగించి ఆలయ సముదాయమంతా ఏకరూపంగా కనిపించేలా ప్రణాళిక రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. “ఇంద్రకీలాద్రికి విచ్చేసే ప్రతి భక్తుడికి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే ఆధ్యాత్మిక అనుభూతి కలగాలి.
రంగులు కేవలం అందానికే పరిమితం కాకుండా ప్రశాంతతను, భక్తి భావాన్ని ప్రతిబింబించాలి. లడ్డూ పోటు, అన్నదాన భవనం, మహామండపం ఒకే నిర్మాణ శైలిలో కనిపించేలా రంగుల ఎంపికలో ఏకరూపత పాటించాలి. దీనికి అనుగుణంగా పనులను వేగంగా పూర్తి చేయాలి” అని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పి. రాఘవరాజు, డిప్యూటీ ఈవో కిషోర్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎల్. రమాదేవి, అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్. రంగారావు, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
