Fertilizer Smuggling | సబ్సిడీ ఎరువుల మళ్లింపుకు అడ్డుకట్ట

Fertilizer Smuggling | సబ్సిడీ ఎరువుల మళ్లింపుకు అడ్డుకట్ట

Fertilizer Smuggling | కృష్ణా, కాకినాడ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు
ఏఐతో అక్రమాల గుర్తింపుకు కొత్త వ్యవస్థ
రైతులకు సమయానికి ఎరువులు అందించే లక్ష్యం

Fertilizer Smuggling | అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఎరువుల పంపిణీ వ్యవస్థలో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతులకు అందాల్సిన సబ్సిడీ ఎరువులు అక్రమ మార్గాల్లో మళ్లిపోకుండా, నిజమైన సాగుదారులకు సమయానికి సరఫరా అయ్యేలా దేశవ్యాప్తంగా కొత్త డిజిటల్ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, కాకినాడ జిల్లాలను ఎంపిక చేశారు.

ఈ యాప్ ద్వారా ఎరువుల నిల్వల నుంచి రైతు కొనుగోలు వరకు ప్రతి దశను ఆన్‌లైన్‌లో పర్యవేక్షించనున్నారు. రైతు ఎంత భూమి సాగు చేస్తున్నాడు, ఏ పంట వేశాడు, ఆ పంటకు ఎంత ఎరువు అవసరం, ఇప్పటికే ఎంత కొనుగోలు చేశాడు వంటి వివరాలన్నీ యాప్‌లో నమోదు కానున్నాయి. దీనివల్ల అవసరానికి మించి ఎరువుల కొనుగోళ్లు, బోగస్ బిల్లులు, సబ్సిడీ ఎరువుల మళ్లింపులకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ కొత్త విధానం అమలుపై వ్యవసాయశాఖ డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన కీలక సమీక్ష సమావేశంలో యాప్ అమలు సమయంలో రైతులకు ఎదురయ్యే సమస్యలు, గ్రామస్థాయి వ్యవస్థ, డీలర్ల పాత్ర, సరఫరా నియంత్రణ, పర్యవేక్షణ విధానాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరాన్ని అధికారులు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

పంటల దశల వారీగా ఎరువుల సరఫరా

ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైతులు ఒకేసారి పెద్ద మొత్తంలో ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల కొన్ని చోట్ల కొరత, మరికొన్ని చోట్ల అధిక నిల్వల పరిస్థితి ఏర్పడుతోంది. కొత్త యాప్ ద్వారా ఈ సమస్యను నివారించాలని ప్రభుత్వం భావిస్తోంది. పంటల దశలను బట్టి రైతులకు ఎరువుల సరఫరా చేయాలని సమావేశంలో ప్రతిపాదించారు.

ఉదాహరణకు వరి విత్తన దశలో ఒక రకం ఎరువు, పెరుగుదల దశలో మరో రకం ఎరువు అవసరం ఉంటుంది. ఆ అవసరానికి అనుగుణంగానే యాప్‌లో పరిమితి నిర్ణయించి విక్రయాలు జరపనున్నారు. దీంతో అవసరానికి మించి కొనుగోళ్లు తగ్గడంతో పాటు, ఎరువుల అందుబాటులో సమతౌల్యం నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు.

గ్రామస్థాయిలో రైతుల ధృవీకరణ

రైతుల అర్హత నిర్ధారణ బాధ్యతను గ్రామ వ్యవసాయ సహాయకులకు అప్పగించే అంశంపై చర్చించారు. గ్రామంలో సాగు చేస్తున్న రైతుల వివరాలు, భూమి విస్తీర్ణం, పంటల నమోదు, సాగు స్థితి వంటి వివరాలను వారు యాప్‌లో నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియ వల్ల నకిలీ రైతుల పేర్లతో ఎరువుల కొనుగోళ్లు, బోగస్ బిల్లింగ్, మధ్యవర్తుల జోక్యం తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రైతుల భూ రికార్డులు, ఈ-క్రాప్ డేటా, ఆధార్ వివరాలతో యాప్‌ను అనుసంధానం చేసే దిశగా కూడా చర్చలు జరిగాయి.

సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక దృష్టి

రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఎరువుల అక్రమ రవాణా సమస్య తరచూ వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా సబ్సిడీ ధరల తేడాల కారణంగా ఒక రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు మరో రాష్ట్రానికి తరలిపోతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో సరిహద్దు మండలాలు, గ్రామాలకు ప్రత్యేక విధానం రూపొందించాలని సమావేశంలో ప్రతిపాదించారు. వాహనాల జియోట్యాగింగ్, డిజిటల్ ట్రాకింగ్, డీలర్ల పర్యవేక్షణ వంటి చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎరువుల సరఫరా వాహనాలు ఎక్కడి నుంచి బయల్దేరాయి, ఎక్కడకు చేరాయి, మధ్యలో ఎక్కడైనా నిలిపాయా వంటి వివరాలను కూడా ట్రాక్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.

ఏఐతో అక్రమాల గుర్తింపు

కొత్త యాప్‌లో కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికత వినియోగంపైనా ప్రత్యేకంగా చర్చించారు. అసాధారణ లావాదేవీలు, అనుమానాస్పద కొనుగోళ్లు, అధిక నిల్వలు వంటి అంశాలను ఏఐ స్వయంచాలకంగా గుర్తించేలా వ్యవస్థ రూపొందించే యోచనలో ఉన్నారు. ఒక రైతు తన సాగు భూమికి అవసరమైన పరిమితిని మించి ఎరువులు కొనుగోలు చేస్తే వెంటనే అలర్ట్ వెళ్లే విధానం ఉండనుంది. అదే విధంగా ఒక డీలర్ వద్ద అనుమానాస్పదంగా భారీ నిల్వలు కనిపించినా అధికారులకు సమాచారం చేరేలా చర్యలు తీసుకోనున్నారు.

దీంతో బ్లాక్ మార్కెట్, నిల్వదారుల అక్రమాలు, సబ్సిడీ ఎరువుల మళ్లింపులపై సమర్థవంతమైన పర్యవేక్షణ సాధ్యమవుతుందని భావిస్తున్నారు. సాంకేతిక వ్యవస్థలు అమలు చేసే సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలు, బయోమెట్రిక్ లోపాలు, సర్వర్ డౌన్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ వ్యవస్థలపై కూడా చర్చించడం జరిగింది. తెలుగు భాషలో సులభంగా వినియోగించుకునే విధంగా యాప్ ఉండాలని అధికారులు సూచించారు.

అవసరమైతే ఆఫ్‌లైన్ మోడ్, ఎస్ఎంఎస్ ఆధారిత ధృవీకరణ వంటి అంశాలను కూడా పరిశీలించనున్నారు. రైతు అనుకూల మార్పులపై అధికారుల నుంచి సూచనలు తీసుకుని, రాష్ట్ర పరిస్థితులకు సరిపోయేలా మార్పులు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.

ఇటీవల పెరిగిన ఎరువుల అక్రమాలు

రాష్ట్రంలో ఇటీవల ఎరువుల అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, వ్యవసాయేతర వినియోగం ఘటనలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అనేక జిల్లాల్లో అధికారులు దాడులు నిర్వహించి వేలాది ఎరువుల సంచులను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని చోట్ల రైతులకు అందాల్సిన సబ్సిడీ ఎరువులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. మరికొన్ని ప్రాంతాల్లో పరిశ్రమల అవసరాలకు మళ్లిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పూర్తి డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థ అవసరమని కేంద్ర ప్రభుత్వం భావించింది.

డీలర్లపై కఠిన నిబంధనలు

కొత్త యాప్ అమలులో భాగంగా ఎరువుల డీలర్లపై కూడా కఠిన నిబంధనలు అమలు చేసే అవకాశం ఉంది. ప్రతి విక్రయం ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. రైతు వివరాలు, పంట వివరాలు, విక్రయించిన ఎరువు రకం, పరిమాణం అన్నీ వెంటనే కేంద్ర డేటాబేస్‌లో నమోదు కానున్నాయి.

డేటాలో తేడాలు కనిపిస్తే వెంటనే విచారణ జరిగే అవకాశముంది. నిబంధనలు ఉల్లంఘించిన డీలర్లపై లైసెన్స్ రద్దు, క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

కొత్త వ్యవస్థపై రైతుల్లో ఆశలు వ్యక్తమవుతున్నాయి. సమయానికి ఎరువులు అందితే పంటల దిగుబడులు మెరుగుపడతాయని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా సీజన్ సమయంలో క్యూలైన్లు, కొరత సమస్యలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు, సాంకేతిక లోపాలు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్త అమలుకు మార్గం

కృష్ణా, కాకినాడ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్‌ను అమలు చేసే అవకాశముంది. తర్వాత దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశం కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. డిజిటల్ సాంకేతికతతో ఎరువుల పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా మార్చడం, రైతులకు నిజమైన లబ్ధి చేకూర్చడం, సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.

Leave a Reply