ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి కె. శరత్
కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు.. నిత్య అన్నదాన కార్యక్రమాన్ని అభినందించిన న్యాయమూర్తి
అచ్చంపేట, ఆంధ్రప్రభ: శ్రీశైలం ఉత్తరద్వారంగా ప్రసిద్ధి చెందిన రంగాపురంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానాన్ని హైకోర్టు న్యాయమూర్తి కె. శరత్ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అచ్చంపేట న్యాయమూర్తితో కలిసి ఆలయానికి చేరుకున్న హైకోర్టు న్యాయమూర్తికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గణపతి పూజ, అమ్మవారికి కుంకుమార్చన, గర్భగుడిలో స్వామివారి అభిషేకం తదితర ప్రత్యేక పూజలను వైదిక పద్ధతిలో నిర్వహించారు.
పూజల అనంతరం అర్చకులు స్వామివారి తీర్థప్రసాదం అందజేసి, శేషవస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి కె. శరత్ మాట్లాడుతూ, ఆలయ ఆధ్యాత్మిక వాతావరణం, నిర్వహణ ఎంతో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ఆలయంలో కొనసాగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, భక్తులకు అందుతున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
