పోడు భూముల పట్టాల కోసం ఉద్యమం

  • 27నచలో ఐటీడీఏ ధర్నా కార్యక్రమం
  • ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుటికల శంకర్

జైనూర్, ఆంధ్రప్రభ : ఎన్నో సంవత్సరాలుగా ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఈనెల 27న చేలో ధర్నా కార్యక్రమాన్ని గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో తలపెట్టినట్లు ఆ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుటికల శంకర్ తెలిపారు. ఉట్నూర్ ఏజెన్సీలోని జై నూరు సిర్పూర్ యు లింగాపూర్ కేరిమేరి వాంకిడి రెబ్బెన తదితర మండలాల్లో గత 50 సంవత్సరాల నుండి ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అటవీ అధికారుల దౌర్జన్యాలు నశించాలని రైతులు సాగు చేస్తున్న భూములను పోలీసుల బలగాలతో అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు.

రైతుల పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు కందకాలు పెడతామని చెట్లు నాటుతామని ఆ భూములు మావి అంటూ ఏజెన్సీ మండలాల్లో అటవీ అధికారుల పెత్తందారని అడ్డుకునేందుకు గ్రామీణ పేదల సంఘం ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందని ఆయన పేర్కొన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ముందు ఈనెల 27న తలపెట్టిన ముట్టడి ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఆదివాసీలు గిరిజనేతర రైతులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆదివాసులు భూములనే కాకుండా ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తున్న కొన్ని గ్రామాల్లోనీ గిరిజనేతర భూములను కూడా అటవీ అధికారులు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించమని వారికి అండగా ఉంటూఉద్యమాలకు సిద్ధంగా ఉంటామని అన్నారు.