24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి
- అర్హుల ఓటు తొలగిపోకూడదు.. అనర్హుల ఓటు జాబితాలో ఉండకూడదు
- జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
అచ్చంపేట, ఆంధ్రప్రభ : ఈ నెల 24వ తేదీలోగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియను పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా, అనర్హులైన ఓట్లు జాబితాలో కొనసాగకుండా అత్యంత పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని స్పష్టం చేశారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని 2వ వార్డు సాయినగర్‌లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన, డిజిటలైజేషన్, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా రామ్‌సింగ్ అనే ఓటరు వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసి డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటికీ పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు, తిరిగి స్వీకరించిన దరఖాస్తులు, పెండింగ్‌లో ఉన్న ఫారాలు, ఆన్‌లైన్ నమోదు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. ప్రతి బీఎల్‌వో రోజుకు కనీసం 60 మంది ఓటర్ల వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి అర్హుడైన పౌరుడిని ఇంటింటికీ వెళ్లి ఓటరుగా నమోదు చేయాలని, ఈ ప్రక్రియలో ఎవరూ మిగిలిపోకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. అనర్హులైన ఓట్ల తొలగింపు ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయం చేసుకుని పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని వేర్వేరు నియోజకవర్గాలు లేదా ఇతర జిల్లాల్లో ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండటం చట్టవిరుద్ధమని కలెక్టర్ హెచ్చరించారు.

భారత ఎన్నికల సంఘం రూపొందించిన డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్ (డీఎస్సీఈ) సాఫ్ట్‌వేర్ ద్వారా డూప్లికేట్ ఓట్లను గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏడాది వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.
చిరునామా, పేరు, వయస్సు లేదా కుటుంబ వివరాల్లో మార్పులు ఉన్నవారు సంబంధిత పత్రాలతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా ప్రక్షాళనను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, తహసీల్దార్ సైదులు, బీఎల్‌వో తిరుపతమ్మ, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
