భీమ్‌గల్‌లో ఊర పండుగకు సర్వం సిద్ధం..

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ పట్టణంలో ఆదివారం నిర్వహించనున్న సంప్రదాయ ఊర పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సర్వసమాజ్ కమిటీ అధ్యక్షుడు కృష్ణ తెలిపారు. పండుగను ఘనంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆదివారం ఉదయం చెట్టు కొట్టడం కార్యక్రమంతో పాటు విగ్రహాల చెక్కల ఊరేగింపుతో వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు.

అనంతరం భూలక్ష్మి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం సంప్రదాయంగా గొర్రెపోతు గావు పట్టడం కార్యక్రమం నిర్వహించి, రాత్రి 10 గంటలకు మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక ముగింపు పూజలతో ఊర పండుగ ముగుస్తుందని వెల్లడించారు. పట్టణ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని సంప్రదాయ పండుగను విజయవంతం చేయాలని సర్వసమాజ్ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.