ధరపల్లిలో చిరుత హతం?

  • చర్మం, గోళ్ల విక్రయానికి యత్నం!
  • పోలీసుల అదుపులో ఒకరు..?
  • ‘మాకేమీ తెలియదు’ అంటున్న అటవీ శాఖ అధికారులు

ధరపల్లి, ఆంధ్రప్రభ : ధరపల్లి మండల పరిధిలో చిరుత పులిని హతమార్చి, దాని చర్మం, గోళ్లను విక్రయించేందుకు ప్రయత్నించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

విక్రయ యత్నంతోనే వెలుగులోకి..?

చిరుత చర్మం, గోళ్లను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే చిరుతను ఎక్కడ హతమార్చారు? ఎవరు హతమార్చారు? చర్మం, గోళ్లు అదుపులో ఉన్న వ్యక్తి వద్దకు ఎలా చేరాయి? విక్రయానికి ఎవరిని సంప్రదించారు? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

‘మాకేమీ తెలియదు’

ఈ వ్యవహారంపై అటవీ శాఖ అధికారులను సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొనడం గమనార్హం. వన్యప్రాణికి సంబంధించిన చర్మం, గోళ్ల విక్రయ యత్నంపై ప్రచారం జరుగుతున్నా అటవీ శాఖకు సమాచారం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు పోలీసుల అదుపులో ఒక వ్యక్తి ఉన్నట్లు సమాచారం ఉన్నప్పటికీ పోలీస్ శాఖ నుంచి కూడా ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అసలు చిరుత హతమైందా? చర్మం, గోళ్లు స్వాధీనం చేసుకున్నారా? అదుపులో ఉన్న వ్యక్తి పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు అధికారిక విచారణలోనే సమాధానం తేలాల్సి ఉంది.

చిరుత చర్మం, గోళ్ల విక్రయ యత్నం వ్యవహారం ధరపల్లి మండలంలో సంచలనం రేపుతుండగా.. అటవీ శాఖకు సమాచారం లేకపోవడం, పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ ఘటన వెనుక అసలు కథేమిటన్నది ఉత్కంఠగా మారింది.