Six Murders | ఆరుగురి హత్యల వెనుక భయానక నిజాలు

సీపీ తరుణ్ జోషీ సంచలన వివరాలు..

Six Murders | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సంచలనం సృష్టించిన ఆరుగురి హత్యల కేసులో నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ కీలక విషయాలను వెల్లడించారు. నిందితుడు రాజ్‌కుమార్ ముందుగా మైనర్ బాలిక తల్లి, నానమ్మలను హత్య చేసి, అనంతరం బాలికను బలవంతంగా తీసుకెళ్లినట్లు తెలిపారు.

సీపీ వివరాల ప్రకారం.. రాత్రి 11 గంటల నుంచి 11.30 గంటల మధ్య రాజ్‌కుమార్ తన కుటుంబ సభ్యులు సహా మొత్తం ఆరుగురిని హత్య చేశాడు. అనంతరం 11.51 గంటలకు తన తండ్రికి ఫోన్ చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పినట్లు వెల్లడించారు.

మే 16న మైనర్ బాలిక కుటుంబ సభ్యులు రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేశారని, ఆ కేసులో గరిష్ఠ శిక్ష ఏడేళ్లలోపు ఉండటంతో అతనికి స్టేషన్ బెయిల్ లభించిందని సీపీ తెలిపారు. నిందితుడిపై పోక్సో కేసుతో పాటు మరో పాత కేసు కూడా ఉన్నట్లు చెప్పారు.

రాజ్‌కుమార్ మానసిక పరిస్థితి సరిగా లేదని ప్రాథమిక విచారణలో తేలిందని, బెట్టింగ్‌లు, ఇతర కారణాలతో అతను సుమారు రూ.1.5 కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్లు గుర్తించామని వెల్లడించారు. అయితే తన భార్య, పిల్లలను ఎందుకు హత్య చేశాడన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని సీపీ తరుణ్ జోషీ తెలిపారు. నిందితుడి కోసం 7 బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.