చండూరులో విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం ఏర్పాటు చేయాలి

​-క్యాంపు కార్యాలయంలో విద్యుత్ అధికారులతో సమీక్ష
-లో-వోల్టేజీ సమస్యలు, లూజ్ లైన్ల ప్రమాదాలను అరికట్టాలి
-మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ : రైతులకు నిరంతరం అందుబాటులో ఉండేలా చండూరులో విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ (డీఈ) కార్యాలయాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన సమీక్షా సమావేశం నుంచే విద్యుత్ శాఖ సీఎండీ కి ఫోన్ చేసి చండూరులో డీఈ ఆఫీస్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు.

​శుక్రవారం మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

​సిబ్బంది కొరతను అధిగమించాలి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటం వల్ల రైతులకు, సాధారణ వినియోగదారులకు సేవలు అందడంలో ఆలస్యం జరుగుతోందన్నారు. ఉన్న సిబ్బందిపైనే పని ఒత్తిడి ఎక్కువగా పెరుగుతోందని, వీలైనంత త్వరగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించుకోవాలని అధికారులకు సూచించారు.

​నియోజకవర్గంలో రైతులను వేధిస్తున్న లో-వోల్టేజీ సమస్యను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. అలాగే అకస్మాత్తుగా వచ్చే గాలి దుమారాల వల్ల లైన్లు లూజ్ అవుతున్నాయని, ఇలాంటి లూజ్ లైన్ల వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టడానికి తగిన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు.

​రోడ్ల విస్తరణకు అడ్డంగా ఉన్న స్తంభాల తొలగింపు..
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రస్తుతం నూతన రోడ్ల వెడల్పు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ పనులకు అడ్డంగా ఉన్న పాత విద్యుత్ స్తంభాలను త్వరితగతిన షిఫ్ట్ చేసి, ప్రత్యామ్నాయంగా కొత్త వాటిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల అటు రోడ్డు పనులకు, ఇటు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ​ఈ సమీక్షా సమావేశంలో నల్గొండ జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్, డీఈలు ప్రసాద్, బాల్య నాయక్, ఏడీఈలు నాగేశ్వరరావు, సాగర్ రెడ్డి, నియోజకవర్గ పరిధిలోని ఏఈలు పాల్గొన్నారు.