నిత్య… గండం

నిత్య… గండం
- నరకప్రాయంగా మారిన రహదారి
- నత్తలు కూడా నవ్వేకునేలా నిర్మాణ పనులు
- శిథిలావస్థకు చేరిన శిలాఫలకం
నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి- సోమారం రహదారి ప్రయాణికుల పాలిట నిత్య గండంగా మారింది. ఏళ్లు గడిచినా రోడ్డు పనులు పూర్తి కాకపోవడం నత్తనడకన సాగడం ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. నిధుల కొరత కారణమో… అధికారుల, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమో తెలియదు కానీ నత్తలు సైతం నవ్వుకునేలా పనులు సాగుతూనే…. ఉన్నాయి. చిల్లేపల్లి నుండి సోమారం వరకు డబుల్ రహదారి నిర్మాణం చేపట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవచూపి రూ.20 కోట్లు నిధులు మంజూరీ చేయించారు. అంతేకాకుండా జూన్ 2024లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభింపజేశారు.
వేగవంతంగా పనులు పూర్తిచేసే నాణ్యతతో నిర్మించాలని అధికారులకు సూచనలు కూడా చేశారు. అయినప్పటికీ రెండేళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది. అధికారులు గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.రహదారి మొత్తం తవ్వకాలు చేసి వదిలేయడంతో గుంతలు పడి ప్రయాణం నరకప్రాయం గా మారింది. వాహనాల ప్రయాణించేటప్పుడు లేచే దుమ్ము దూళికి వెనుక ఉన్న వాహనదారులకు కంకర తేలిన రహదారి కనిపించక ప్రమాదాలు చోటుచేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, అత్యవసర సేవలు అందుకోవాల్సిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారి నిర్మాణం కొరకు మంత్రి శంకుస్థాపన చేసిన శిలాఫలకం సైతం శిథిలావస్థకు చేరుకోవడం కొస మెరుపు. తాజాగా ఈ రహదారిలో ఓ కల్వర్టు వద్ద పెద్ద గుంత ఏర్పడడంతో స్థానికులే చొరవ చూపి ఓ మొద్దు తెచ్చి పాతిపెట్టి ప్రమాద సూచికగా ఏర్పాటు చేశారు.
స్థానిక ప్రజలు ప్రజా ప్రతినిధులు పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాధానం రాలేదని ఆరోపిస్తున్నారు. నిధుల సమస్యా లేక కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా అనే సందేహాలు వ్యక్త మవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అభివృద్ధి పేరుతో ప్రారంభించిన ఈ రహదారి పనులు ఆలస్యమవడం ప్రజల్లో నిరాశను కలిగిస్తోంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ చొరవ చూపి పనులను వేగవంతం చేసి, చిల్లేపల్లి సోమవారం గ్రామాల ప్రజలకు సౌకర్యవంతమైన రహదారిని త్వరితగతిన నిర్మించాలని కోరుతున్నారు.
