చెరువు కట్టకు మరమ్మతులు.. పూర్తిగా రాకపోకలు బంద్
- ఇబ్బందులు పడుతున్న రైతులు,ప్రయాణికులు,ఉద్యోగులు
- డైవర్షన్ రోడ్డు లేక.. వాహనాలతో పొలాల్లో ప్రయాణం
మోత్కూర్,ఆంద్రప్రభ: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో గతేడాది చెరువుకట్ట (మినీ ట్యాంక్ బండ్) కుంగడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం కట్ట మరమ్మతుల కోసం ఇటీవల రూ.36 లక్షలు మంజూరు చేయగా, అట్టి పనులు ప్రారంభించారు. దీంతో ఈ రూట్లో కారు, ఆటో, బస్సులు వెళ్ళకుండా అనాజీపురం, పాటిమట్ల మీదుగా డైవర్షన్ చేశారు.
మోత్కూర్ పట్టణం నుండి నిత్యం చెరువు కట్ట అవతల వైపు వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు,కూలీలు,మహిళలు, ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు తమ పనుల నిమిత్తం బైక్ ల పై వెళ్తుంటారు.కానీ కాంట్రాక్టర్ కనీసం డైవర్షన్ రోడ్డు కూడా వేయకుండా ఏకంగా ఫుట్ పాతు సైతం కూల్చివేయడంతో కేవలం అర కి.మీ వెళ్లాల్సిన బాటసారులు,రైతులు, ఉద్యోగులు తమ వాహనాలతో కట్ట కింద పొలాల్లో తమ బైక్ ,మోపెడ్ లతో టౌన్ కి చేరుకోవడం తీవ్ర ఇబ్బందిగా మారడంతో పాటు ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.
కొంతమంది కేవలం అర కి.మీ కోసం సుమారు 15 కి.మీ దూరం వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు త్వరితగతిన కట్ట మరమ్మతు పనులు పూర్తి చేసి కనీసం ద్విచక్ర వాహనాలు,బాట సారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని,డైవర్షన్ రోడ్డు వేయాలని కోరుతున్నారు.
