మరో నాలుగు రోజులు మాత్రమే సర్!
- ఓటర్లు త్వరితగతిన ఫారాలు బీఎల్‌వోలకు అందజేయండి
- క్షేత్రస్థాయిలో సదా ఓటర్ల సేవలో బీఎల్‌వోలు, అధికారులు అందుబాటులో
- ఈ నెల 11, 12 తేదీల్లో సర్ ప్రత్యేక శిబిరాలు
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను ఈ నెల 14వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉందని, ఓటర్లు త్వరితగతిన ఫారాలు అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ కోరారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈ నెల 11, 12 తేదీల్లో (రెండవ శనివారం, ఆదివారం) జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డిజిటైజేషన్ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక శిబిరాల్లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు), పర్యవేక్షక అధికారులు, ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఓటర్ల ఈఎఫ్ డిజిటైజేషన్‌ను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
డిజిటైజేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడం సర్ ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశమని పేర్కొంటూ, సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రత్యేక శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించి, ప్రతి ఫారాన్ని సకాలంలో డిజిటైజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే ఈ ప్రత్యేక శిబిరాలను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. ఇంకా ఎవరికైనా ఫారం అందకపోయినా, సమర్పించకపోయినా, మ్యాప్ కాకపోయినా ప్రత్యేకంగా దృష్టిసారించి నిబద్ధతతో కార్యకలాపాలను పూర్తిచేయాలని ఆదేశించారు.
