14న ఎస్ఐఆర్ ప్రక్రియకు చివరి రోజు
- అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం
- జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి
కర్నూలు, ఆంధ్రప్రభ: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ జూలై 14తో ముగియనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, ప్రజలు పూర్తి సహకారం అందించి గడువులోగా ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి కోరారు.
శుక్రవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందన్నారు. మిగిలిన నాలుగు రోజులను సద్వినియోగం చేసుకుని బీఎల్‌ఏలు, బీఎల్‌వోలు సమన్వయంతో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ పూర్తి చేయాలని సూచించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బూత్ స్థాయిలో బీఎల్‌వోలకు రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు సహకరించాలని కోరారు. రెండో శనివారం, ఆదివారం రోజుల్లో కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌వోలు అందుబాటులో ఉంటారని చెప్పారు.
ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుని, పూర్తి వివరాలు, ఫొటోలతో నింపి సమర్పించాలని సూచించారు. ఓటు హక్కు కోల్పోకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో 250 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 48 పోలింగ్ కేంద్రాల స్థానాలను మార్చినట్లు తెలిపారు. బీఎల్‌వోలకు సహకరించేందుకు డ్వామా, అంగన్‌వాడీ తదితర శాఖల సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. సమావేశంలో డీఆర్‌వో వెంకటనారాయణమ్మ, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మురళి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
