డెంగ్యూ, మలేరియా నివారణకు ప్రజల సహకారం అవసరం
కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ: డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. జాతీయ డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడ నగరంలోని మాచవరం ప్రాంతంలో జిల్లా మలేరియా అధికారి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు ఇంటింటి అవగాహన కార్యక్రమం నిర్వహించి డెంగ్యూ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం తమ ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడా నిల్వ నీరు లేకుండా చూసుకోవాలని సూచించారు. నిల్వ నీరే దోమల వ్యాప్తికి ప్రధాన కారణమని, నీటి పాత్రలను ఎప్పటికప్పుడు ఖాళీ చేసి శుభ్రపరచాలని ప్రజలకు సూచించారు. వ్యాధుల నివారణలో వైద్య ఆరోగ్య శాఖ, మలేరియా సిబ్బందికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటే డెంగ్యూ, మలేరియా వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించవచ్చని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
