కృష్ణా డీఐపీఆర్‌వోగా జయరావుకు బాధ్యతలు
మచిలీపట్నం, ఆంధ్రప్రభ: కృష్ణా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (ఎఫ్‌ఏసీ)గా పి. జయరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని జిల్లా సమాచార పౌర సంబంధాల కార్యాలయంలో ఆయన డీఐపీఆర్‌వోగా పదవీ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ డీకే బాలాజిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు సకాలంలో, పారదర్శకంగా చేరవేయడంలో సమాచార పౌర సంబంధాల శాఖ కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంలో ఆధునిక సమాచార సాధనాలను వినియోగించడంతో పాటు ప్రజలకు విశ్వసనీయమైన సమాచారాన్ని చేరవేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
పదవీ బాధ్యతలు స్వీకరించిన పి. జయరావు మాట్లాడుతూ.. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా చేరవేయడానికి సమన్వయంతో పనిచేస్తూ శాఖ ప్రతిష్ఠను మరింత పెంపొందించేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
