ఎండల వేళ.. ప్రజలకు చల్లని అండ..

ఎండల వేళ.. ప్రజలకు చల్లని అండ..

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కేడీసీసీ బ్యాంకు సేవా స్ఫూర్తి..
కూడళ్లు, బస్టాండ్లు, గ్రామీణ కేంద్రాల్లో చలివేంద్రాలు..
సామాజిక బాధ్యతలో సహకార రంగం ముందంజ..

విజయవాడ, ఆంధ్రప్రభ : మండుతున్న ఎండలు, రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు (కేడీసీసీ బ్యాంకు) ప్రజలకు ఉపశమనం కలిగించే దిశగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో వేసవి సేవా కార్యక్రమాలను చేపట్టింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, సహకార రంగం కూడా సామాజిక బాధ్యతను చాటుకుంటూ ముందుకు సాగుతోంది.

జిల్లాలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైతు బజార్లు, మార్కెట్ యార్డులు, గ్రామీణ కేంద్రాలు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి చల్లని తాగునీరు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వృద్ధులు, రైతులు, కూలీలు, ప్రయాణికులు, సాధారణ ప్రజలకు ఈ సేవలు విశేష ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఈ సందర్భంగా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ, సహకార రంగం కేవలం బ్యాంకింగ్ సేవలకే పరిమితం కాకుండా అవసరమైన సమయంలో ప్రజలకు అండగా నిలవాలనే సంకల్పంతో ముందుకు సాగుతోందన్నారు.

ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు వెల్లడించారు. కేడీసీసీ బ్యాంకు సీఈఓ శ్యామ్ మనోహర్ పర్యవేక్షణలో, జీఎం చంద్రశేఖర్, డీజీఎం రంగబాబు, ఏజీఎంలు, బ్రాంచ్ మేనేజర్లు, సొసైటీ అధ్యక్షులు, పీఏసీఎస్ ప్రతినిధులు, సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. వేసవి తీవ్రత నుంచి ప్రజలు రక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాలను వినియోగించుకోవాలని, సేవా కార్యక్రమాల విజయానికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, సహకార సంఘాల ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు.

Leave a Reply