గోవధను ప్రభుత్వం అరికట్టాలి..
- బిజెపి మండల అధ్యక్షులు పీక వెంకన్న
- వెలిమినేడు శివారులో ఘటనాస్థలాన్ని పరిశీలించిన బీజేపీ నాయకులు
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని వెలిమినేడు శివారులో వెలుగులోకి వచ్చిన గోవధ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చిట్యాల బీజేపీ మండల అధ్యక్షుడు పీక వెంకన్న ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం వెలిమినేడు శివారులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వెనుక నార్లగుట్ట సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో భారీ ఎత్తున గోవధ చేసి కళేబరాలను సిమెంట్ రింగుల్లో భద్రపరిచినట్లు సమాచారం రావడంతో, బీజేపీ నాయకులు ఘటనాస్థలాన్ని సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా పీక వెంకన్న ముదిరాజ్ మాట్లాడుతూ, ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర కోణం ఉండే అవకాశాలు ఉన్నాయని ఆరోపించారు. ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, ఇందులో ప్రమేయం ఉన్న వారిని గుర్తించి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఘర్ష నరేష్, అనిల్, పున్న విష్ణు, గట్టోజు నరేంద్రచారి తదితరులు పాల్గొన్నారు.
