ఇద్దరు ఉపాధ్యాయులు సెలవులో..

  • తరగతులు అటెండర్ పర్యవేక్షణలో
  • నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని అంతర్నీ పాఠశాల ఘటన..
  • విచారణకు స్థానికులు విజ్ఞప్తి

కుబీర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని అంతర్నీ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఇద్దరు రెగ్యులర్ ఉపాధ్యాయులు సెలవులో ఉండటంతో విద్యార్థుల పర్యవేక్షణను అటెండర్ నిర్వహించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

స్థానికుల సమాచారం ప్రకారం, ఆ పాఠశాలలో ఇద్దరు రెగ్యులర్ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఇద్దరూ సెలవులో ఉండగా, పాఠశాలకు హాజరైన 18 మంది విద్యార్థులను అటెండర్ చూసుకుంటూ ఉండటం గమనించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు.

ఈ ఘటనపై కొందరు గ్రామస్థులు స్పందిస్తూ, ఒకేరోజు ఇద్దరు ఉపాధ్యాయులు సెలవులో ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ బోధన ఏర్పాట్లు జరిగాయా? సంబంధిత నిబంధనలు పాటించబడాయా? అనే అంశాలపై స్పష్టత అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై మండల విద్యాధికారి (ఎంఈఓ) విజయ్‌కుమార్‌ను సంప్రదించగా, తాను సెలవులో ఉన్నానని, దీనికి సంబంధించి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించాలని సూచించారు.

అనంతరం స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిని వివరణ కోరగా, ఇద్దరు ఉపాధ్యాయులు ఒకేసారి సెలవులో వెళ్లవద్దని ముందుగానే సూచించినట్లు తెలిపారు. అయితే ఇద్దరూ ఒకేరోజు సెలవు తీసుకున్న విషయం తన దృష్టికి ముందుగా రాలేదన్నారు. సమాచారం అందిన వెంటనే క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్‌పీ)ను పాఠశాలకు పంపించి మధ్యాహ్నం వరకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు.

ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో సెలవు దరఖాస్తులు పెట్టి ఉంటారని కాంప్లెక్స్ హెచ్ఎం తెలిపారు. ఈ ఘటనపై స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు స్పందిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ బోధన ఏర్పాట్లు ముందుగానే ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.