july10th indrakeeladri | కనకదుర్గ అమ్మవారి నిత్య సమాచారం..

july10th indrakeeladri | భక్తజన సందోహంతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి
గురువారం కనకదుర్గమ్మ దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
అన్నదానానికి విశేష స్పందన..
రూ.4.10 లక్షలకు పైగా విరాళాలు
దసరా నాటికి అన్ని భవనాలను సిద్ధం చేస్తాం
దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్

july10th indrakeeladri | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కనకదుర్గమ్మ దర్శనానికి గురువారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసి దర్శనం సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లు, భద్రత, తాగునీరు తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచారు.

గురువారం నాటి సమాచారం…

దేవస్థానం గణాంకాల ప్రకారం గురువారం 34,234 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 5,077 దర్శన టికెట్లు జారీ అయ్యాయి. భక్తులకు 55,678 ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయానికి రూ.4,10,697 విరాళాల రూపంలో అందగా, 341 మంది వివిధ సేవల్లో పాల్గొన్నారు. 1,941 మంది తలనీలాలు సమర్పించుకోగా, 7,506 మంది భక్తులు నిత్య అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు.

అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్…

ఇదిలా ఉండగా, దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్, దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ)తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, త్వరలోనే నూతన అన్నదాన భవనాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని, దసరా మహోత్సవాల నాటికి అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసేలా ఇంజినీరింగ్ అధికారులు వేగవంతంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.