AP | తెలుగింటి ఆడ‌ప‌డుచుల‌కు మ‌హిళా దినోత్స‌వం శుభాకాంక్ష‌లు… చంద్ర‌బాబు

వెల‌గ‌పూడి | మహిళా దినోత్సవం జరుపుకోవడం అనవాయితీ కాదని, ఇది సమాజ బాధ్యత అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, మాతృసమానులైన మహిళామణులకు చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోందని, మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళాభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించిన విషయం తెలిసిందేనన్నారు.

తాజాగా 2025- 26 వార్షిక బడ్జెట్ లో మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా రూ.4,332 కోట్లు కేటాయించడం ద్వారా వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అలాగే ‘దీపం 2’ స్కీమ్ కింద 90.1లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అంగన్ వాడీ సెంటర్ల బలోపేతం లాంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్దితో పనిచేస్తున్నామన్నారు. మహిళాభివృద్దితోనే సమాజాభివృద్ది అని బలంగా నమ్మి పనిచేస్తున్నామని, మహిళ భద్రత, గౌరవం, సాధికారతకు కట్టుబడి ఉన్నామని తెలియజేశారు.

మ‌హిళ‌లు బాగుంటేనే దేశం బాగుంటుంది… జ‌గ‌న్
మ‌హిళ‌లంద‌రికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌హిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని తెలిపారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న నానుడి ఉందన్నారు. ఆ నానుడిని నమ్ముతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మన ప్రభుత్వ కాలంలో మ‌హిళల అభ్యున్నతి, సాధికార‌తకు పెద్దపీట వేస్తూ పాల‌న చేశామని పేర్కొన్నారు. అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా ప‌థ‌కాల‌ ద్వారా వారికి భ‌రోసా క‌ల్పించామని, నామినేటెడ్ ప‌ద‌వులు, ప‌నుల్లో 50శాతం కేటాయిస్తూ తొలిసారిగా చ‌ట్టం చేశామని వివరించారు. గిరిజ‌న‌, ద‌ళిత మ‌హిళ‌ల‌ను డిప్యూటీ సీఎం, హోంమంత్రి లాంటి పెద్ద ప‌ద‌వుల‌తో గౌర‌వించామని పేర్కొన్నారు. మహిళల భద్రత, రక్షణ కోసం దిశ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ‌పెట్టామని జగన్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *