Amaravati-Vinila : ఈ వినీల.. అమరావతి తార .. Andhra Prabha Top Story
Amaravati-Vinila : ఈ వినీల.. అమరావతి తార .. Andhra Prabha Top Story
- ఫ్లోరిడాలో మెరిసిన సౌందర్య తేజం
- వయా మిసెస్ తెలుగు యూఎస్ఏ’
- ఇక గ్లోబల్ పేజెంట్ ప్రస్థానం
- ఎవరో కాదు చలపతి విద్యార్థి
(ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ):

అందం అంటే కేవలం రూపం కాదు… ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, సంస్కారం, సమాజం పట్ల బాధ్యత కూడా కావాలని ప్రపంచ వేదికపై మరోసారి నిరూపించారు అమరావతికి చెందిన దొప్పలపూడి వినీల. అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ప్యూర్ ఇంటర్నేషనల్ గ్లోబల్ బ్యూటీ పేజెంట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి తెలుగు మహిళ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశారు.
జూన్, జులై మాసాల్లో జరిగిన ఈ అంతర్జాతీయ పోటీల్లో యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్, గ్రీస్, యూరప్‌లోని పలు దేశాలు, పశ్చిమ ఆఫ్రికా, హైటి, అమెరికా తదితర దేశాల ప్రతినిధులతో కలిసి పోటీపడ్డ వినీల తన వ్యక్తిత్వం, సంభాషణా నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, భారతీయ సంస్కృతి పట్ల అంకితభావంతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
Amaravati-Vinila : ఆత్మవిశ్వాసమే ఆమె అందం

ఈ పోటీల్లో బాహ్య సౌందర్యానికి మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సంస్కృతిపై అవగాహన వంటి అంశాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి విభాగంలోనూ ప్రతిభ కనబరిచిన వినీల అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు అందుకున్నారు. భారతీయ మహిళ సామర్థ్యాన్ని, తెలుగు మహిళ ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.
Amaravati-Vinila : అంచెలంచెలుగా ….

వినీల విజయ ప్రస్థానం ఒక్కసారిగా ప్రారంభమైనది కాదు. నిరంతర కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ నేటి స్థాయికి చేరుకున్నారు.
2025లో మిసెస్ తానా పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన ఆమె, 2026లో మిసెస్ తెలుగు యూఎస్ఏ పోటీలకు ఎంపికయ్యారు. అనంతరం మిసెస్ తెలుగు గుడ్ విల్ అంబాసిడర్ బిరుదును అందుకున్నారు. ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్యూర్ ఇంటర్నేషనల్ గ్లోబల్ బ్యూటీ పేజెంట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ద్వారా తన విజయ గాథలో మరో స్వర్ణాధ్యాయాన్ని లిఖించారు.
Amaravati-Vinila : ప్రపంచ వేదిక పై వయా అమరావతి

తుళ్లూరు మండలం హరిశ్చంద్రాపురం గ్రామానికి చెందిన అంజమ్మ–నరసింహరావు దంపతుల కుమార్తె వినీల. అమరావతిలో జన్మించి గుంటూరులో పెరిగారు. చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన ఆమె, 2016లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ బిజినెస్ ఇంటెలిజెన్స్ (BI) డెవలపర్‌గా పనిచేస్తున్నారు.
ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే వ్యక్తిత్వ వికాసం, మహిళా సాధికారత, సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
Amaravati-Vinila : చలపతి విద్యాసంస్థలకు గర్వకారణం

ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన వినీల చలపతి ఇంజినీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థిని కావడం ఆ విద్యాసంస్థకు మరో గర్వకారణంగా నిలిచింది. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలకు చలపతి ఇస్తున్న ప్రాధాన్యానికి వినీల విజయం నిదర్శనమని అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పేర్కొంటున్నారు.
Amaravati-Vinila : ప్రశంసల వెల్లువ

అమరావతి నుంచి ప్రపంచ వేదిక వరకు… ప్రతిభకు సరిహద్దులు లేవని నిరూపించిన తెలుగు మహిళ దొప్పలపూడి వినీల. అందంలో ఆకర్షణ… వ్యక్తిత్వంలో భారతీయత… ప్రతి అడుగుతో తెలుగు జాతి గౌరవాన్ని, భారతదేశ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటుతున్న స్ఫూర్తిదాయక మహిళ జిల్లా వాసులు కొనియాడుతున్నారు. వినీల సాధించిన విజయంపై కుటుంబ సభ్యులు, చలపతి విద్యాసంస్థల యాజమాన్యం, స్నేహితులు, ప్రవాస భారతీయులు, అమరావతి వాసులు, గుంటూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింతగా చాటాలని ఆకాంక్షిస్తున్నారు
