వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యం: కూన రవికుమార్
శ్రీకాకుళం బ్యూరో, ఆంధ్రప్రభ: దేశంలో వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా తీర్చిదిద్దేందుకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతికత, సమర్థవంతమైన నీటి నిర్వహణ, మార్కెట్ అనుసంధానానికి ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆమదాలవలస ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ (పీయూసీ) చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో వ్యవసాయం, భూమి, నీటి వనరులపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కూన రవికుమార్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ వ్యవసాయ విధానాలను అధ్యయనం చేసి, రైతులకు ఉపయోగపడే అంశాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇలాంటి జాతీయ స్థాయి చర్చలు ప్రజాప్రతినిధులకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు భవిష్యత్ విధానాల రూపకల్పనకు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ వర్క్‌షాప్‌లో వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు, విధాన రూపకర్తలు పాల్గొని రైతుల ఆదాయాన్ని పెంచే వ్యూహాలు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాల విస్తరణ, భూ పరిపాలనలో పారదర్శకత, నీటి వనరుల సమర్థ వినియోగం, వాతావరణ మార్పులకు అనుగుణమైన వ్యవసాయ విధానాలపై చర్చించారు. రైతుల అభ్యున్నతికి సంబంధించిన ఈ సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉందని కూన రవికుమార్ తెలిపారు.
