Fish Market | కోహెడలో చేపల మెగా మార్కెట్

కోహెడలో దేశంలోనే తొలి ఎగుమతి ఆధారిత హోల్‌సేల్ చేపల మార్కెట్‌కు శంకుస్థాపన
రూ.47.03 కోట్లతో ఆధునిక చేపల మార్కెట్ నిర్మాణం..
కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ సదుపాయాలు
సుమారు 5 వేల మందికి ఉపాధి..
తెలంగాణ చేపలకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు
హాజ‌రైన మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

Fish Market | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా కోహెడలో దేశంలోనే తొలి అంతర్గత ఎగుమతి ఆధారిత హోల్‌సేల్ చేపల మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.47.03 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆధునిక మార్కెట్‌కు మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, తెలంగాణ మత్స్యరంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే చేపలకు విలువను పెంచడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేలా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.

నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మార్కెట్‌లో అత్యాధునిక శీతల గిడ్డంగులు (కోల్డ్ స్టోరేజీలు), చేపల శుద్ధి మరియు ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ కేంద్రాలు, నిల్వ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో చేపల నాణ్యతను కాపాడుతూ ఎగుమతులకు అనువైన విధంగా ఉత్పత్తులను సిద్ధం చేసే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి వెల్లడించారు. అలాగే తెలంగాణలో ఉత్పత్తి అయ్యే చేపలకు ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మత్స్యరంగాన్ని ఆధునికీకరించడంతో పాటు రైతులు, మత్స్యకారులకు మెరుగైన మార్కెటింగ్ వేదిక కల్పించేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో మత్స్యరంగం వాటాను మరింత పెంచే దిశగా ఈ మార్కెట్ ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.