జిల్లాలో 80 శాతం ఓటరు వివరాల డిజిటలైజేషన్ పూర్తి
జూలై 14లోపు వంద శాతం పూర్తి చేయడమే లక్ష్యం: కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని, ఓటరు వివరాల డిజిటలైజేషన్ ఇప్పటికే 79.69 శాతానికి చేరుకుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జూలై 14లోపు డిజిటలైజేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తిచేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు.
జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లకు గాను 13,39,675 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా 99.97 శాతం పంపిణీ పూర్తయిందన్నారు. ఇప్పటివరకు 10,67,946 ఫారాలు డిజిటలైజ్ చేయడంతో పురోగతి 79.69 శాతానికి చేరిందని తెలిపారు. నియోజకవర్గాల వారీగా నగరిలో 84.02 శాతం, జి.డి.నెల్లూరులో 81.37 శాతం, పలమనేరులో 80.34 శాతం, పూతలపట్టులో 79.72 శాతం, చిత్తూరులో 76.71 శాతం, కుప్పంలో 76.18 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఇప్పటివరకు 19,701 మంది మరణించిన ఓటర్లు, 8,344 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, 7,263 మంది ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారు, 789 మంది గైర్హాజరు, 108 ఇతర కేసులను గుర్తించినట్లు వెల్లడించారు. మొత్తం 36,205 మందిని అన్‌కలెక్టబుల్‌గా గుర్తించామని, తుది పరిశీలన అనంతరం ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.
జిల్లాలో 1,511 మంది బీఎల్ఓలు విధులు నిర్వహిస్తున్నారని, గత 24 గంటల్లోనే 42,920 ఫారాలను డిజిటలైజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి వారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఈ నెల 14న మరో సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఓటర్ల వివరాల్లో మార్పులు, సవరణలు అవసరమైన వారు ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ‘ సేవను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు కూడా ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి సహకరించి నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తయ్యేలా సహాయపడాలని విజ్ఞప్తి చేశారు.
