AP | ప్రతి జిల్లా కేంద్రంలో ఒక కేన్సర్ కేర్ సెంటర్ : మంత్రి సత్యకుమార్
తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : మహమ్మారిగా మారుతున్న క్యాన్సర్ నివారణ చర్యల్లో భాగంగా.. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడం, నివారణ చర్యల ఏర్పాట్లు తక్కువగా ఉండడం ప్రధాన సమస్య గా మారుతోందన్నారు. రాష్ట్రంలో క్యాన్సర్ విస్తరణ 9.93 శాతంగా గుర్తించామని తెలిపారు.
అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల కేన్సర్ పరీక్షలను నిర్వహించే బృహత్ కార్యక్రమాన్ని గత ఏడాది నవంబర్ లో మొదలు పెట్టామని చెబుతూ ప్రజల్లో సరైన అవగాహన లేక పోవడంతో గత రెండున్నర నెలల్లో 71 లక్షల పరీక్షలు మాత్రమే నిర్వహించగలిగామన్నారు.
గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య సంరక్షణకు పెద్ద పీట వేసిందని అంటూ గతంలో కన్నా 12 శాతం ఎక్కువగా ఈ ఏడాది బడ్జెట్ లో రూ.9.05 లక్షల కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్యాన్సర్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలనీ సంకల్పించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 200 సెంటర్ల ఏర్పాటుకు నిధులను బడ్జెట్ లో కేటాయించిందని చెప్పారు.
మరోవైపు తాజా బడ్జెట్ లో 36 రకాల కేన్సర్ నివారణ మందుల ధరలను 50 శాతం వరకు తగ్గించిందని, జి ఎస్ టీ కూడా ఎత్తివేసిందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో కేంద్రం విడుదల చేసిన నిధులు ఎటు మళ్ళించారో, ఎందుకు వ్యయం చేశారో అంతుపట్టకుండా ఉందని అంటూ, భవిష్యత్తులో అటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు.
గత వై సి పి ప్రభుత్వ హయాంలో వైద్య రంగాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకునే పాలకులు 26 వేల ఉద్యోగాల ఖాళీలు భర్తీ కూడా చేయకుండా వెళ్లారని ఎద్దేవా చేశారు. ఆర్ధిక పరమైన అంశాల పై సమగ్ర అవగాహన ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సమీప భవిష్యత్తులో రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగాన్ని గాడి లో పెట్టి అన్ని వర్గాలకు మేలు చేకూర్చనున్నట్టు తెలిపారు. ఈ బి జె పి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ సమావేశంలో బి జె పి నాయకులు కోలా ఆనంద్, నవీన్ కుమార్ రెడ్డి , పొనగంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.